30 పెరిగిన సన్ ఫ్లవర్ పామాయిల్ రూ.20 పెంపు
మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా సామాన్యుడి గృహ బడ్జెట్ను తలకిందులు చేస్తోంది.
గత కొద్ది రోజులుగా వంట నూనె ధరలు అమాంతం పెరగడమే ఇందుకు నిదర్శనం. యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు అమాంతం పెరగనున్నాయన్న భయాందోళనతో రాష్ట్రంలోని ప్రధాన సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల వద్ద వంట నూనెల కొనుగోలు కోసమే జనం క్యూ కడుతున్నారు.
ధరల సెగ.. నిల్వ కోసం జనం పాట్లు
యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే సరఫరా నిలిచిపోతుందనే ప్రచారంతో వినియోగదారులు ఒక్కసారిగా దుకాణాలకు తరలివస్తున్నారు. భవిష్యత్తులో ధరలు ఇంకా పెరుగుతాయనే భయంతో ప్రస్తుతం ఉన్న పాత గరిష్ట రిటైల్ ధర వద్దే నూనె ప్యాకెట్లను భారీగా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కొద్ది రోజులుగా వంట నూనె ధరలు గత పది రోజుల్లోనే గణనీయంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో మార్కెట్లో సన్ఫ్లవర్ ఆయిల్ కిలో నూనె రూ.150 గా ఉండగా ఇప్పుడు అది రూ.180కి చేరింది. కొద్దణ రోజుల్లోనే కిలో పై రూ.20 మేర పెరిగింది. కేవలం సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే కాకుం డా పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే పామాయిల్ ధరలు కూడా లీటరుకు రూ.15 నుండి రూ.20 వరకు పెరిగాయని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు.
సామాన్యుడికి దొరకని పరిస్థితి
ముఖ్యంగా హోటల్ యజమానులు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు 15 కేజీల టిన్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో రిటైల్ మార్కెట్లో సామాన్యులకు వంట నూనెలు దొరకడం కష్టంగా మారింది.
భారతదేశం తన వంట నూనెల అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అదే సమయంలో దేశం వినియోగించే ముడి చమురులో దాదాపు 60 శాతం విదేశాల నుంచే వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా అది నేరుగా మన దేశీయంగా నిత్యావసరాల ధరలపై ప్రభావం చూపుతుంది.
రవాణా ఖర్చుల పెరుగుదల
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా చమురు రవాణా చేసే నౌకలు ప్రయాణించే మార్గాలు ప్రమాదకరంగా మారాయి. దీంతో సరుకు చేరడానికి పట్టే సమయం పెరగడమే కాకుండా ఖర్చులు కూడా రెట్టింపు అవుతున్నాయి. ఇదే జరిగితే రాబోయే రెండు మూడు నెలల్లో గృహ ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాలధరలను అదుపులో ఉంచేందుకు భారత ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అయినప్పటికీ మార్కెట్లో ధరల సెగ మాత్రం సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.